హైదరాబాద్ అమ్మాయిల జీవితాలతో అరబ్ దేశాల మగవారు చెలగాటం ఆడుతున్నారు. డబ్బు కోసం కొందరు పేద ముస్లింలు తమ మైనర్ కుమార్తెలను అరబ్ ధనవంతులకు కట్టబెడుతున్నారు.
ఫర్హీన్ సైన్స్ చదువుకుని నర్స్ కావాలనుకుంది. కానీ ఆమెకు 13 ఏళ్ళ వయసులోనే జోర్డాన్‌కి చెందిన 55 ఏళ్ళ వ్యక్తికిచ్చి పెళ్ళి చేశారు.
ఒక రోజు ఫర్హీన్ తండ్రి ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి ముగ్గురు మగవాళ్లకు చూపించాడు. ఆ సాయంత్రమే ఆ ముగ్గురిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని తండ్రి చెప్పాడు.
"నేను గట్టిగా ఏడ్చాను, ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పాను. ఎవరూ వినలేదు" అంది ఫర్హీన్.
ఆమె తల్లి ఫర్హీన్‌ని పెళ్లి కూతురిలా తయారు చేసింది. పెళ్లి చేసినందుకు ఆ అరబ్ వ్యక్తి రూ. 25 వేలు ఇస్తున్నాడనీ, అది కాక నెలా నెలా రూ. 5 వేలు ఇస్తాడని కూతురితో చెప్పింది తల్లి.
ఈ హైదరాబాదీ బాలికకు, అరబ్ పెద్ద మనిషికి ఖాజా దగ్గరుండి పెళ్ళి చేశారు.
‘నేను ఏడుస్తుంటే రేప్ చేశాడు...‘
వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు మొదటిసారి ఫర్హీన్ అతణ్ని చూసింది. తనకంటే దాదాపు నలభై ఏళ్లు పెద్ద వాడని అప్పుడే గుర్తు పట్టింది.
"ఆ రాత్రి నేను ఏడుస్తుంటే, అతను బలవంతం చేశాడు. మూడు వారాల పాటు నన్ను రేప్ చేశాడు’’ అని గుర్తు చేసుకుంది ఫర్హీన్.
ఆ తరువాత ఫర్హీన్‌ని తనతో పాటు జోర్డాన్ వచ్చి అక్కడ తన ఇతర భార్యలు, పిల్లల బాగోగులు చూసుకోవాలని అతడు చెప్పాడు. అతడికి అంతకు ముందే పెళ్లయినట్లు ఫర్హీన్‌కు తెలియదు. తాను జోర్డాన్ రానని చెప్పేసింది.
దీంతో అతడు ముందు జోర్డాన్ వెళ్లిపోయి, తరువాత ఫర్హీన్‌కి వీసా పంపించేలా రాజీ కుదిరింది.
కానీ వీసా ఇప్పటికీ రాలేదు. ఫర్హీన్‌కి పెళ్లయి ఒంటరిగానే ఉంటోంది. ఆమె భర్త ఎక్కడున్నాడో ఆమెకి తెలీదు.
‘నన్నే నిందిస్తున్నారు...‘
"నేనిప్పుడు ఏడవడం లేదు. మౌనంగానే ఉంటున్నా. ఈ అర్థంలేని బతుకు చాలించాలనుకున్నా. నా కన్నవారే నన్ను మోసం చేశారు" అంది ఫర్హీన్.
ఇది జరిగి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ ఫర్హీన్‌ను ఇంకా ఆ భయం వెంటాడుతూనే ఉంది. అందుకే ఆమె నన్ను (బీబీసీ ప్రతినిధి) తాను టీచర్‌గా పనిచేస్తున్న ఎన్‌జీఓ ఆఫీసులో మాత్రమే కలవడానికి ఒప్పుకుంది.
"ముసలివాడిని పెళ్లి చేసుకున్నానని కొందరు చుట్టాలు ఎగతాళి చేశారు. ఇంకొందరైతే మా ఆయన కోర్కెలు తీర్చలేకపోయాననీ అందుకే వదిలేశాడనీ నా ముందే అన్నారు" అని ఫర్హీన్ చెప్పుకొచ్చింది.
మూడేళ్లలో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన 48 కేసుల్లో ఫర్హీన్ కేసు ఒకటి.
వారిని భారత్ రప్పించే అవకాశాలు చాలా తక్కువ
ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రోకర్లు అరెస్టయ్యారు కానీ, పెళ్లిళ్లు చేసుకునే వారు భారతీయులు కాకపోవడంతో వారిని అరెస్టు చేయడం సాధ్యం కాదు.
"మామూలుగా బాధితులు మా దగ్గరకు రారు. మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అరబ్ మగవాళ్లు వీరిని వదిలేసి, తమ సొంత దేశం పారిపోయాకే మా దగ్గరకు వస్తారు. ఇదే మాకు పెద్ద సవాల్. దీంతో మేం విదేశాంగ శాఖను ఆశ్రయించాలి. అప్పుడు కూడా వారిని భారతదేశానికి రప్పించే అవకాశాలు చాలా తక్కువ‘‘ అని చెప్పారు హైదరాబాద్ దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ.
ఇది చాలా బలమైన నేరస్తుల ముఠా అని పోలీసులు చెప్తున్నారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నకిలీ పెళ్లి సర్టిఫికెట్లు తయారు చేసే బ్రోకర్లు ఈ వ్యవహారంలో ఉన్నారని వారంటున్నారు. హైదరాబాద్‌లోని ఇరుకు ఇళ్లల్లో రహస్యంగా జరిగే బాల్య వివాహలకు చట్టబద్ధత కల్పించే సర్టిఫికెట్లు వీళ్లు తయారు చేస్తారని చెప్తున్నారు.
ఈ సెప్టెంబరులో ఇద్దరు 80 ఏళ్లకు పైబడిన వృద్ధులతో సహా 8 మంది అరబ్ షేక్‌లను, 35 మంది మధ్యవర్తులను పోలీసులు అరెస్టు చేశారు.
బలవుతోంది బాలికలే...
కానీ అసలు నమోదు కాని కేసులు చాలా ఎక్కువ. అమ్మాయిలంతా 12 నుంచి 17 ఏళ్ల వారే కావడం దీనికి ఒక కారణం అంటారు హక్కుల కార్యకర్తలు.
తబుస్సమ్ అనే అమ్మాయికి 70 ఏళ్ల వ్యక్తితో పెళ్లయ్యే నాటికి ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలే! ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి హోటల్‌కి తీసుకెళ్లి లైంగికంగా హింసించాడు. తరువాత వీసా పంపుతానని చెప్పి ఆమెను ఇంటికి పంపేశాడు. ఆ తరువాత ఏడాది తబుస్సమ్ ఒక పాపకు జన్మనిచ్చింది. కానీ ఆ పాపను తబుస్సమ్‌కి చెల్లి అని చెప్పి పెంచారు.
"నా కన్న కూతురు నన్ను అక్కా అని పిలిచిన ప్రతిసారీ నా గుండె తరుక్కుపోతుంది. ఆమె నన్ను అమ్మీ అని పిలిస్తే వినాలని ఎదురుచూస్తున్నాను" అని చెప్పింది తబుస్సమ్.
ఈ పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు ఎక్కువగా ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యెమన్ నుంచి వస్తారు.
Comments
Post a Comment